Tuesday, 3 November 2026

కేసీఆర్ తెలంగాణ సీఎం కావడం ఆర్టీసీ కార్మికుల అదృష్టం

BUS-BHAVAN-LIVE-10-HARISHసీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం ఆర్టీసీ కార్మికుల అదృష్టమని మంత్రి హరీష్ రావు అన్నారు. వేరెవ్వరైనా ముఖ్యమంత్రి అయ్యుంటే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తెగనమ్మేవాళ్లని చెప్పారు. తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో రెండోసారి ఘన విజయం సాధించిన టీఎంయూ ఇవాళ హైదరాబాద్ లోని బస్ భవన్లో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ నుండి నెలకు రూ. 18 కోట్లు ఇప్పిస్తున్నారని మంత్రి హరీష్ రావు చెప్పారు. కార్మికులు అడగకుండానే జీతాలు పెంచి, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అని కొనియాడారు. ఇప్పటికీ ఇతర ప్రభుత్వ ఉద్యోగులకన్నా ఆర్టీసీ కార్మికుల వేతనాలు తక్కువ ఉన్నాయని అన్నారు.

అడక్కుండానే 44 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా కార్మికులు కృతజ్ఞతలు తెలపాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఆక్యుపెన్సీ రేషియోను ఒకప్పటిలా 85 శాతం వరకు తీసుకు పోదామన్నారు. 2017లో ఫిట్ మెంట్ మరింత ఎక్కువ రావాలంటే ఓఆర్ పెంచడానికి కృషి చేయాలని చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు ఇళ్ల స్థలాల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. రాజకీయాల పేరిట కాంగ్రెస్ అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తోందని ఆయన విమర్శించారు.

కార్మికులంతా కష్టపడి, ఆర్టీసీని అభివృద్ధి పథం వైపు నడిపించాలని హోం, కార్మిక శాఖల మంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు.
రోజుకు రెండు కోట్ల రూపాయల నష్టాలతో నడుస్తున్న ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. కార్మికులు జీతాల కోసం ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.

నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉందని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. కార్మికులకు వేధింపులు ఉండవని భరోసా ఇచ్చారు.

సంస్థ పరిరక్షణ బాధ్యత మనదేనని టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు అన్నారు. ముఖ్యమంత్రి అండదండలు ఉన్నందున దేశంలోనే ఆదర్శంగా ఆర్టీసీని బలోపేతం చేద్దామని చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, టీఎస్ ఆర్టీసీ ఎండీ రమణారావు గుర్తింపు సంఘం పత్రాన్ని టీఎంయు నేతలకు అందజేశారు.
అసెంబ్లీ డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, టీఎంయు నేతలు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు ఈ సభలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *