Thursday, 5 November 2026

కొత్తపల్లి సొసైటీలో నిధులు గోల్ మాల్.కొత్తపల్లి సొసైటీలో నిధులు గోల్ మాల్.

సహకార చట్టం సెక్షన్ 51 ప్రకారం పూర్తిస్థాయి విచారణ జరపాలని సంఘం సభ్యుల అత్యవసర తీర్మానం.
విధులు నిర్వహించబోమని రాతపూర్వకంగా తెలిపిన సిబ్బంది.

కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-మండలంలోని కొత్తపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలోని నిధుల విషయంలో 2021-22 సం.గాను ఆడిటింగ్ నిర్వహించారు.ఈ ఆడిట్ నివేదిక ప్రకారం సొసైటీలో అవినీతి జరిగిందంటూ ఆడిట్ నివేదికలు తెలుపడంతో సహకార సంఘం పాలక వర్గ సభ్యులు శుక్రవారం రోజున అత్యవసర సమావేశం నిర్వహించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ సమావేశం సింగిల్ విండో ఛైర్మెన్ డా.సునీల్ కుమార్ అధ్యక్షతన కొనసాగింది.గతంలో కొత్తపల్లి సొసైటీలో నిధులు దుర్వినియోగ మైనట్లు ఆరోపణలు రావడంతో అధికారులు ఆడిట్ చేశారు.ఈ ఆడిట్ నివేదికలు తెలిపిన వివరాల ప్రకారం సొసైటీలో అవినీతి జరిగిందని తేలడంతో సెక్షన్ 51 సహకార చట్టం కింద కొత్తపల్లి సొసైటీని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సంఘం సభ్యులు సమావేశం ద్వారా తీర్మానించారు.ఈ సందర్భంగా సొసైటీలోని 170 ఎరువుల బస్తాలు ఎలా మాయమైనయని ఎవరు మాయం చేశారని సిబ్బందిని ఛైర్మెన్ అడిగారు.దీంతో పాలక వర్గ సభ్యుల తీరుపై సిబ్బంది అసహనం వ్యక్తం చేస్తూ సంఘం అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేసిన తమపై అనుమానాలు వ్యక్తం చేయడంపై వారు మండిపడుతూ విధులను భాహిష్కరిస్తునట్లు పాలక వర్గ సభ్యులకు లేఖను అందజేశారు.సిబ్బంది చెప్పిన విధంగానే శనివారం విధులకు గైర్హాజరయ్యారు. సిబ్బంది డుమ్మా కొట్టడంతో శనివారం సొసైటీ తాళాలు కూడా తీయలేదు.కనీసం పాలక వర్గం కూడా సొసైటీ వైపునకు రాకపోవడంతో సహకార సంఘం నుండి శని వారం రైతులకు ఎలాంటి సేవలు అందలేదు.సొసైటీ కి వచ్చిన రైతులు సొసైటీ బంద్ ఉండడంతో ఎందుకు బందుందో తెలియక అయోమయంలో తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. గతంలోను కూడా ఈ సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రజలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.అయిన కొత్తపల్లి సొసైటీపై నెలకొన్న ఈ ఆడిట్ నివేదికలు,ఆరోపించబడుతున్న పలు ఆరోపణలను పూర్తి స్థాయిలో నివృత పరచాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఎంతైనా ఉందని రైతులు వాపోతున్నా రు.