కొత్త సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌,జనవరి26  (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న కొత్త సచివాలయం నిర్మాణ పనులను ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు మంగళ వారం పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని కలియ తిరిగి, నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజనీర్లు, వర్కింగ్‌ ఏజన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. సచివలయ నిర్మాణంలో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కేసీఆర్‌ సూచించారు. ప్రధాన గేట్‌తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని, డిజైన్లను సీఎం పరిశీలించారు. చివరిసారిగా 2019 జూన్‌ చివరి వారంలో సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం.. కొత్త భంతులకు శంఖుస్తాపన చేశారు. మళ్లీ 19 నెలల తర్వాత.. రిపబ్లిక్‌ డే నాడు ఆయనీ ప్రాంగ ణానికి వచ్చారు. కొత్త సచివాలయ నిర్మాణ పనుల సందర్శనలో సీఎం కేసీఆర్‌ వెంట ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి సునిల్‌ శర్మ, ఇఎన్‌సీ గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులున్నారు. కాగా, రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబైకి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకున్న విషయం విదితమే. రూ.617 కోట్లతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు. 2019లోనే శంకుస్థాపన జరిగినప్పటికీ, ముహుర్తబలం, కోర్టు చిక్కుల కారణంగా కూల్చివేత, కొత్త నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగడంతో పనుల వేగం పుంజుకోనుంది.