Tuesday, 3 November 2026

కొనసాగుతున్న పంచాయతీ సెక్రటరీల ఆందోళనలు

 

 

 

 

 

బిచ్కుంద మే 04 (జనంసాక్షి)తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌‌తో జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్‌‌)లు చేస్తున్న సమ్మె వారం రోజుల నుండి కొనసాగుతోంది. రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చి చెబుతున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. పైగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జేపీఎస్‌‌ల స్థానంలో రెగ్యులర్ సెక్రటరీలకు ఒక్కొక్కరికీ 5, 6 గ్రామాల బాధ్యతలను మండల పంచాయతీ అధికారులు అప్పగిస్తూ సర్క్యులర్లు ఇస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని మండల అధికారులు చెబుతున్నారు. ప్రజలు వివిధ పనుల కోసం వెళితే సెక్రటరీ లేరు మళ్లీ రండని పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది చెబుతున్నారు. దీంతో గ్రామ వ్యవస్థ కుంటుపడుతోంది. ప్రభుత్వం స్పందించి వీరి సమస్యలను పరిష్కరించాలని జనం కోరుతున్నారు.