– పవన్, బీజేపీ మధ్య లాలూచీ బయటపడింది
– ఏపీ మంత్రి యనమల
అమరావతి, నవంబర్14(జనంసాక్షి) : కోడికత్తి దాడిపై రాష్ట్రపతికి ఎలా ఫిర్యాదు చేస్తారని ఆంధప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. మంత్రి యనమల బుధవారం విలేకరుల సమావేశంలో సమావేశంలో మాట్లాడారు.. విశాఖలో ఫిర్యాదు లేకుండా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ధైర్యం గురించి పవన్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు ఉన్న ధైర్యం ఏమిటో దేశం మొత్తం తెలుసన్నారు. పవన్ కల్యాణ్ ద్వారా తెలుసుకోవాల్సిన పనిలేదన్నారు.
బీజేపీ హిందువుల పార్టీ కాదని జనసేన అధినేత సర్టిఫికేట్ ఇవ్వడం ఆ పార్టీతో పవన్ లాలూచికి నిదర్శనమని ఏపీ మంత్రి యనమల ఆరోపించారు. హిందువుల పార్టీ కాదన్న బీజేపీతో కలుస్తారా, లేదా అనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో తన వైఖరిని పవన్ తెలపాలని డిమాండ్ చేశారు. బీజేపీతో పవన్ కల్యాణ్ సంబంధాలపై స్పష్టత ఇవ్వకుండా ఆ పార్టీని
వెనకేసుకు వస్తున్నారని మండిపడ్డారు. నిజంగా ప్రధాని మోడీని విమర్శించే దైర్యం జగన్, పవన్ లకు లేదని అన్నారు. కేంద్రాన్ని నిధులు అడిగే దమ్ములేదని ఆయన విమర్శించారు. కోడికత్తి పై ఫిర్యాదు ఇవ్వడం బాధితుడిగా జగన్ బాధ్యత అని, ఘటన జరిగి 19రోజులైనా బాధితుడు నోరు తెరవడం లేదన్నారు. థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.




