Wednesday, 4 November 2026

గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు పంపిణీ

వీణవంక జులై 5( జనం సాక్షి) వీణవంక హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ ఆధ్వర్యంలో వీణవంక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 160 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తినడానికి స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు జగదీశ్వర్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారని గమనించి తాను ఇప్పటివరకు 82 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తినటానికి విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు, ఎగ్జామ్ ప్యాడ్స్, పంపిణీ చేశామన్నారు. పాఠశాలలలో చదువుతున్న అనాధ విద్యార్థులకు, నోటుబుక్కులు, డిక్షనరీలను, ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో 10 జిపిఏ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు క్యాష్ అవార్డ్స్, ప్రతి సంవత్సరము మాథ్స్ డే, సైన్స్ డే లలో టాలెంట్ టెస్టులు నిర్వహించి నగదు ప్రోత్సాహకాలు, బహుమతులు అందించడం జరిగిందన్నారున్నారు. తాను ఇప్పటివరకు కరీంనగర్, హనుమకొండ ,సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న 12వేల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందించామన్నారు. వృద్ధుల వికలాంగుల ఆశ్రమాలలో సైతం చీరలు, దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, క్రీడా మైదానాలలో 80 సిమెంట్ బెంచీలు, నిరుద్యోగ యువతకు గ్రూప్- 2 మెటీరియల్, కరోనాకాలంలో హుజురాబాద్ 20వ వార్డు మున్సిపల్ కార్మికులకు 15 రోజులకు సరిపడా వంట సరుకులు కొనివ్వడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ట్రస్టుకు ఆర్థిక చేయూతనిస్తే వారి పేరు పైనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి మాట్లాడుతూ మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మణమూర్తి, రిటైర్డ్ టీచర్ బుచ్చయ్య, వార్డు మెంబర్ వెంకటరమణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.