Thursday, 5 November 2026

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఫోటో మరియు రాజ్యాంగ ప్రతిమను పెట్టాలి

: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్
కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ :
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలతో పాటు గణతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరవేసే ప్రతి ప్రాంతంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిమను కచ్చితంగా పెట్టాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న అన్నారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలంటూ శనివారం దేవరకొండ డివిజన్ ఆర్డీవో కార్యాలయంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుర్రి వెంకన్న మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. ఆనాటి నుండి నేటి వరకు దేశ పరిపాలన రాజ్యాంగం ఆధారంగా జరుగుతున్నదన్నారు. కానీ ఆ రాజ్యాంగం రచించిన డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక చోట్ల అవమానాలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రాజ్యాంగ రచయితను సమాజానికి దూరం చేస్తున్నారన్నారు. ఇది సమాజంలో ఆరోగ్యకర పరిణామం కాదని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయనను భారత సమాజం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కావున డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు జాతీయ పతాకం ఎగరవేసే అన్నిచోట్ల ఖచ్చితంగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నల్గొండ జిల్లా సలహాదారులు డాక్టర్ యేకుల రాజారావు, కంబాలపల్లి వెంకటయ్య, జిల్లా నాయకులు మేడ సైదులు, ఆడెపు సతీష్, డివిజన్ నాయకులు చేపూరి రాజేష్, మెరుగు వెంకటయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు