హైదరాబాద్ : అవగాహనా రాహిత్యంతోనో…చిన్నపాటి అహంతోనో, అర్థం లేని అనుమానాలతోనో.. పచ్చటి కుటుంబాల్లో విషాదాలు కమ్ముకుంటున్నాయి. మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే చిన్న సమస్యలకు కూడా పచ్చని సంసారంలో నిప్పులు కురుస్తున్నాయి. చిన్న వివాదాలకే నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. చిన్న పిల్లలను సైతం చంపేసి వారూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజగా ఓ తల్లి నవమాసాలు మోసి కన్న బిడ్డను కూడా అత్యంత పాశవికంగా కర్చీఫ్ తో గొంతు నులిమి చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పేట్ బషీరాబాద్ గణేష్ హౌసింగ్ కాలనీలో చోటు చేసుకుంది. భర్త, స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు సంబంధించి ఆమె మూడు పేజీల సూసైడ్ నోటు రాసింది. ఈ సూసైడ్ నోటు గుజరాతీ భాషలో వుండటంలో అనువాదం చేసిన తరువాతనే ఆత్మహత్యకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. అనంతరం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆరు సంవత్సరాల క్రితం వివాహం…
గుజరాత్ కు చెందిన హర్ష దంపతులు గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు వున్నాడు. కొంతకాలంగా భార్యా భర్తల మధ్య కలహాలు వస్తున్నట్లుగా సమాచారం. ఈ కలహాలతోనే మనస్థాపానికి గురైయి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. హర్ష భర్త గ్రనేట్ బిజినెస్ చేస్తుంటారు. వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్యా, కుమారుడు ఆత్మహత్య చేసుకోవటంతో షాక్ గురయి స్థానికుల సహాయంతో పోలీసులకు సమచారం అందించారు. కాగా పోలీసులు అనుమానాస్పదంగా కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




