గల్ఫ్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి
హైదరాబాద్: ఉపాధి కోసం ఎడారి దేశాలకు వలసపోయి మోసపోయిన నిరుపేద కార్మిక కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. గల్ఫ్ దేశాల బాధితులపై ఇవాళ హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చర్చాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంనుంచి బతుకుదెరువు కోసం అరబ్ దేశాలకు వెళ్లి తిరిగి స్వదేశం వచ్చేందుకు డబ్బులు లేక జైళ్లలో ముగ్గుతున్న భారతీయులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చుతో వెనక్కి రప్పించాలని సమావేశంలో తీర్మానించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయానికై గత అక్టోబరు నెలలో విడుదల చేసిన జీవోనే ఇంతవరకూ అమలుచేయలేదని భాజపా శాసన సభాపక్ష నేత లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈ అంశంపై వచ్చే శాసనసభ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు ఆయన చెప్పారు.



