Wednesday, 4 November 2026

గల్లీల్లో ఏ సంఘటన జరిగినా గుర్తించడానికే సీసీ కెమెరాల ఏర్పాటు

 చాదర్‌ఘాట్‌: తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్‌ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ పీస్‌ అండ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఆధ్వర్యంలో మలక్‌పేట నల్లగొండ చౌరస్తాలోని సిమ్లా గార్డెన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలోని గల్లీల్లో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, చీమ చిటుక్కుమన్నా తెలుసుకోవటానికి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు.
నగరంలోని అత్యధిక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటు దాదాపు పూర్తయిందని.. ఇంకా చాలాచోట్ల ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలు రూపొందించి వాటిని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. కేసీఆర్‌ లాంటి సీఎం మనకు ఉండడం అదృష్టమన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామన్నారు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నచోటే అభివృద్ధి జరుగుతుందన్నారు. నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.
కులాలు, మతాలకు అతీతంగా శాంతి, సంక్షేమ సంఘం ప్రతినిధులు శాంతియుత వాతావరణం కల్పించేందుకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారని సమావేశానికి అఽధ్యక్షత వహించిన సెంట్రల్‌ పీస్‌ అండ్‌ వెల్ఫేర్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి గులాంసాదిక్‌ ఉద్దీన్‌ అన్నారు. కమిటీ కార్యదర్శి నారాయణరెడ్డి, నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, జాయింట్‌ సీపీ(ఎస్‌బీ) నాగిరెడ్డి, తూర్పు మండల డీసీపీ డాక్టర్‌ రవీందర్‌, ఏసీపీలు గిరిధర్‌, సీహెచ్‌ సుధాకర్‌, ప్రేంకాజల్‌ (ట్రాఫిక్‌), ఇన్‌స్పెక్టర్లు సత్తయ్య, గంగారెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *