గాంధీ అహింసా మార్గం ప్రపంచానికే మార్గదర్శనం

★ కరీంనగర్ లో ఘనంగా ఫ్రీడమ్ రన్

★ ఆకర్షణగా 500 మీటర్ల జాతీయ పతాకం

★ త్రివర్ణం అయిన కరీంనగర్

★ తెలంగాణ ఫలాలు ఇప్పుడే అందుతున్నాయి

* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా నుండి మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జాతీయ స్ఫూర్తిని నింపారు.
కరీంనగర్ త్రివర్ణమైంది. మువ్వన్నెల పతాకాల రెపరెపలతో మురిసిపోయింది. భారత్ మాతా కీ జై అంటూ వేలాది గొంతుకల నినాదాలతో మార్మోగింది. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ స్వాతంత్ర్య స్పూర్తిని నింపింది. ఫ్రీడం రన్ లో భాగంగా బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం ప్రపంచానికే మార్గదర్శనం అని అన్నారు. అమరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ ఏకమై వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 4వ రోజు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని జాతీయపతాకం వరకు ఈ రన్ కొనసాగింది ఈ రన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించారు. మంత్రి త్రివర్ణ పతాకం చేతబూని ముందుకు సాగగా వేలాదిగా కరీంనగర్ వాసులు తన వెంట నడిచారు. భారత్ మాతాకి జై అంటూ మువ్వన్నేల పతాకాలతో కదం తొక్కారు. దీంతో కరీంనగర్ లోని రహదారులన్ని త్రివర్ణమయమై స్వాతంత్ర్య దినోత్సవ సందడి చోటు చేసుకుంది. 500 మీటర్ల భారీ జాతీయ పతాకం ప్రధానాకర్షణగా నిలిచింది. ఇది ఇలా ఉంటే చిన్నారులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషాధారాణలతో ఆకట్టుకున్నారు. ఎందరో వీరుల త్యాగఫలంతో 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్దించిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్దిపథంలో దూసుకుపోతుందన్నారు. అభివృద్ది ఫలాలు ప్రతి భారతీయుడికి చేరుతున్నాయన్నారు. మహాత్మా గాంధీ లాంటి సమరయోధులు అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తీసుకువస్తే, సీఎం కేసీఆర్ సైతం అహింస మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. స్వయం పాలనలో. తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతూ స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రతి తెలంగాణ బిడ్డకు అందుతున్నాయన్నారు. సిఎం కేసిఆర్ పిలుపుమేరకు 15 రోజులపాటు వజ్రోత్సవ సంబురాలు నిర్వహించుకుందామన్నారు. మహానీయులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి స్వతంత్ర్య భారతాన్ని కానుకగా అందిస్తే మనం విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించి పర్యావరణాన్ని భావితరాలకు కానుకగా అందిద్దామన్నారు. అంతే కాకుండా తల సేమియా రోగులకు అండగా నిలిచేందుకు విరివిగా రక్తదాన శిబిరాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈనెల 16వ తేదీన ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంతో పాటు, ఈనెల 15వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో మధ్యప్రదేశ్ జబల్ పూర్ కు చెందిన ఇంటర్నేషనల్ శ్యామ్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారే జహాన్ సే అచ్చ అంటూ శ్యామ్ బ్యాండ్ మ్యూజిక్ చిన్నపెద్ద తేడాలేకుండా అందరిని పులకరింపజేసింది. చివరగా జనగణమన జాతీయగీతాలపనతో ఫ్రీడమ్ రన్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ సునీల్ రావు కలెక్టర్ వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ తో పాటు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పలువురు పాల్గొన్నారు.