గిరిజన సంక్షేమ శాఖ డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
–టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్
టేకులపల్లి,అక్టోబర్ 30( జనం సాక్షి ): గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్ళలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల కోయగూడెం ముందు డైలీవేజ్ వర్కర్లు నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని ఆదివారం సందర్శించి వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్,డైలీ వేజ్ వ్యవస్థ లేకుండా అందర్నీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు అదే వ్యవస్థను కొనసాగించడం సరైనది కాదని,వారు ఇచ్చిన మాట ప్రకారం డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేసి వారికి ఉద్యోగ భ ద్రత కల్పించాలన్నారు. గత 25 సంవత్సరాలుగా డైలీ వేజ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వాన్ని చూపి రెగ్యులర్ చేయాలన్నారు.2020 పిఆర్సి ప్రకారం 30% జీతాలు పెంచాలని,సంవత్సర కాలంగా జీతాలు రావట్లేదని వాటిని వెంటనే చెల్లించాలన్నారు.చనిపోయిన డైలీ వేజ్ వర్కర్ల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని,వారి జీతాలు పెంచాలని,హెల్త్ కార్డులు ఇవ్వాలని,ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డైలీ వేజ్ వర్కర్ల సంఘ నాయకులతో వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించి ఆశ్రమ పాఠశాలలు,హాస్టళ్ళు సజావుగా సాగేటట్లు చూడాలని కోరారు.ఈ సమ్మెలో వర్కర్లు జి.నాగులు,డి.వెంకట్రాం,డి.శ్రీను,ధనమ్మ,బాలమ్మ,ఎర్రమ్మ,రాధ తదితరులు పాల్గొన్నారు.




