Thursday, 5 November 2026

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

 

టేకులపల్లి,జనవరి 23( జనం సాక్షి): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారిలో గల సులానగర్ సమీపాన జరిగింది. టేకులపల్లి ఎస్ఐ భూక్య శ్రీనివాస్ కథనం ప్రకారం… ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై ఇల్లందు నుండి కొత్తగూడెం వైపు వెళ్తున్న కొత్తగూడెంలోని బూడిదగడ్డకు చెందిన యువకుడు (28) సులానగర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమై మెదడు చిందిపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సులానగర్ గ్రామానికి చెందిన యువకులు గ్రామ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వాహనాలు నిలిపివేసి, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. టేకులపల్లి ఎస్సై హుటాహుటిన చేరుకుని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. మృతుని ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగిన సమయంలో సులానగర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన చోట కొంచెం ఇసుక పడి ఉండటంతో ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు