గోల్కొండ: ఈనెల 19 నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కోటలోగల ఎల్లమ్మ (జగదాంబిక) ఆలయంలో ఆషాడ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం ప్రారంభం కావడం ఆనవాయితీ. అమావాస్య 16న వస్తుండడంతో 19వ తేదీ ఆదివారం నుంచి బోనాల జాత ప్రారంభమై నెలరోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్‌దర్వాజ మహంకాళి ఆలయంలో జరుగుతాయి. ఆషాడ మాసం చివరి రోజున గోల్కొండ కోటలోనే చివరి బోనం పూజ జరడంతో ఉత్సవాలు ముగుస్తాయి.
బోనాలవేడుకల కోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జగదాంబిక ట్రస్టు బోర్టు ఏర్పాట్లు మొదలు పెట్టింది. గురువారం, ఆదివారం నాడు బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. నెలరోజుల పాటు తొమ్మిది ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూజలకు నగరం నలు మూలల నుంచే కాక, రంగారెడ్డిజిల్లా, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.




