చార్మినార్: ‘‘గో వధను నిషేధించాలి. గో హత్య మహాపాతకం’’ అంటూ హిందువులు ప్రచారం చేయడం సాధారణమే. కానీ ఓ ముస్లిం సంస్థ కూడా గోవధ తగదని ప్రచారం చేస్తోంది. ‘‘ఓ వర్గం పూజించే గోవులను వధించడం మానుకోండి. ఇతరుల మనోభావాలను గౌరవించండి’’ అనే నినాదంతో పాతబస్తీలోని బార్కస్‌లో ‘అరబ్ గో రక్షా సమితి’ ప్రచారం నిర్వహిస్తోంది. అబ్దుల్లా బిన్ అలీ బా హమీద్ అనే వ్యక్తి దీని వ్యవస్థాపకుడు. తమ సమితి కార్యకలపాలపై ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘ఆవుల వల్ల సమాజానికి కలిగే లాభాలపై పరిశోధన చేశాను. భారత దేశంలో నాలుగు లక్షల మంది అరబ్ దేశస్థులుండగా ఒక్క బార్కస్‌లోనే రెండు లక్షల మంది జీవిస్తున్నారు. అందుకే మొదటగా అరబ్ గోరక్షా సమితి కార్యకలాపాలను బార్కస్‌లోనే ప్రారంభించాం. ఇక ముందు దేశవ్యాప్తంగా ఉన్న అరబ్బులు, ఇతర ముస్లిం సముదాయాల్లోనూ గో వధకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తాం’’ అని పేర్కొన్నారు. సైన్స్ ప్రకారం ఆవు పాలతో లాభాలు ఉన్నాయన్నారు.




