Friday, 6 November 2026

గోవా, బీహార్‌లకు పాకిన కర్ణాటక ఎఫెక్ట్‌

– మమ్మల్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి
– గోవాలో కాంగ్రెస్‌, బీహార్‌లోని ఆర్జేడీ పార్టీలు గవర్నర్‌లకు వినతులు
గోవా, మే18(జ‌నం సాక్షి ) : కర్ణాట రాజకీయాలు గోవా, బీహార్‌ను తాకాయి. కర్ణాటలో పూర్తి మెజార్టీ రాకపోయినా అత్యధిక స్థానాల్లో గెలుపొందామంటూ బీజేపీ ప్రభుత్వాన్ని ఫాం చేసింది. ఈనేపథ్యంలో గోదా, బీహార్‌లలో ఆయా పార్టీలు అత్యధిక స్థానాలు దక్కించుకున్న పార్టీలుగా నిలిచాయి. కానీ వేరేపార్టీల పొత్తుతో బీజేపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ గోవా కాంగ్రెస్‌, బీహార్‌లోని ఆర్జేడీ పార్టీలు శుక్రవారం తమ గవర్నర్లకు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. కర్ణాటకలో అనుసరించిన విధానాన్నే ఇక్కడా పాటించాల్సిందిగా ఈసందర్భంగా వారు కోరారు. అవకాశం కల్పిస్తే సభలో మెజార్టీ నిరూపించుకుంటామని గోవా కాంగ్రెస్‌ నేత యతీశ్‌నాయక్‌ తెలిపారు. ఈ మేరకు గవర్నర్‌ మృదులా సిన్హాకు మెమోరాండంను ఇచ్చారు. మరోవైపు తేజస్వీ యాదవ్‌ తన మిత్రపక్షాల నాయకులతో కలిసి బీహార్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కలిశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ అవతరించిందని కావునా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-17, బీజేపీ-13, ఎంజీపీ-3 స్థానాల్లో గెలుపొందారు. కాగా ఎమ్మెల్యే ఫిరాయింపుతో ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధికంగా 80స్థానాల్లో గెలుపొంది సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. ఇక్కడ జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమి అధికారంలో కొనసాగుతుంది.