
హైదరాబాద్ : గ్రేటర్ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు టీడీపీ నేతలు. బల్దియా పీఠంపై టీఆర్ఎస్‌ను కూర్చోబెట్టాలని ప్రజలు నిర్ణయించారని… ఈ ఎన్నికల్లో ప్రజలకు టీఆర్ఎస్ ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవాలని అన్నారు. అటు నగర ప్రజలు టీఆర్ఎస్‌కు ఓట్లు వేసినంత మాత్రాన తమను తిరస్కరించినట్టు కాదని.. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని విపక్ష నేతలు అంటున్నారు.గ్రేటర్ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయన్నారు టీడీపీ నేతలు. ఓటర్ల తీర్పును తాము గౌరవిస్తామన్నారు. తమ అభ్యర్ధుల ఓటమికి కారణాలు విశ్లేషించుకుంటామని చెప్పారు. అటు ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేసేవరకూ ప్రజల పక్షాన ఉండి పోరాడుతామన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటములపై పార్టీ ప్రభావం కంటే స్ధానిక సమస్యలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు.గ్రేటర్ ఫలితాలు అధికార పార్టీకి మేయర్ పీఠాన్ని కట్టబెట్టాయన్నారు టీడీపీ నేత రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో వందసీట్ల గెలుపునకు సంబంధించిన సవాల్ విసిరింది తాను కాదని, ఆ సవాల్ విసిరింది మంత్రి కేటీఆర్ అని అన్నారు. సవాల్‌ను స్వీకరించానని తాను చెప్పినా.. ఆ తర్వాత కేటీఆరే వెనక్కి తగ్గారన్నారు. వందసీట్లు అనకుండా జెండా ఎగరవేస్తామని కేటీఆర్ తరువాత వివరించారన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడినంత మాత్రాన ప్రజలు తమను తిరస్కరించినట్టు కాదన్న రేవంత్.. ఫలితాలు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నారు. గ్రేటర్ ప్రజలకు అధికార పార్టీ ఇచ్చిన హమీలను నేరవేర్చే విధంగా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మొత్తం మీద గ్రేటర్ ఫలితాలు టీడీపీకి నిరాశనే మిగిల్చాయి. ఇప్పటికే తెలంగాణలో పడుతూ లేస్తున్న ఈ పార్టీకి గ్రేటర్ దెబ్బ శరాఘాతంగా తగిలిందంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.




