హుజూర్ నగర్ జూన్ 2 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హుజూర్ నగర్ పట్టణంలోని ఆర్డిఓ, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాలలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ కోసం చావు దాకా వెళ్లి చావును ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమమే ఆయుధంగా, ఉద్యమమే ఊపిరిగా మలిదశ ఉద్యమం కొనసాగించి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అదే ఉద్యమ స్ఫూర్తితో, అదే ఉద్యమ పందాతో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగించడం జరుగుతుంది. నేడు తెలంగాణ దేశంలోనే అనేక రంగాలలో ప్రధమముగా నిలుస్తూ తెలంగాణ అభివృద్ధి పథకాలను ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో కొనసాగిస్తున్నటువంటి అనేక అభివృద్ధి పథకాలు నేడు చూడొచ్చు. అంతేకాకుండా కొత్తగా నిర్మించుకున్నటువంటి సెక్రటరీయేట్ చూడడానికి దేశవ్యాప్తంగా ప్రజలు పోటెత్తుతున్నారు. అభివృద్ధిలో పర్యాటక రంగంలో నేడు తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలబడుతుంది. అదే ఉద్యమ స్ఫూర్తితో, అదే ఉద్యమ పందాతో హుజూర్ నగర్ అభివృద్ధిని కూడా ప్రారంభించడం, హుజూర్ నగర్ నియోజకవర్గంలో శరవేగంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలు నేడు ప్రజలు ప్రత్యక్షంగా చూడవచ్చు. నియోజకవర్గంలో అనేక రంగాలలో సరికొత్త మార్పుని తీసుకురావడం జరిగింది. ఈ మార్పు స్పష్టంగా ప్రజలకు కనపడడానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. ఇప్పటికే పూర్తి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలను మరో రెండు, మూడు నెలలో పూర్తి చేసి 100% చెప్పినటువంటి అన్ని పనులను చేసి చూపిస్తామన్నారు. త్వరలో హుజూర్ నగర్ మెయిన్ రోడ్డుని కూడా సంపూర్ణం గావించి హుజూర్నగర్ లో మరి ఎటువంటి అసౌకర్యానికి చోటు లేని రోడ్లను పూర్తి చేస్తామని తెలియజేశారు. హుజూర్ నగర్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. ఇంకో రెండు నుండి మూడు నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసి చూపిస్తామని శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, కౌన్సిలర్లు దొంగరి మంగమ్మవీరారెడ్డి, కుంట ఉపేంద్రసైదులు, చిలకబత్తిని సౌజన్య ధనుంజయ్, వీర్లపాటి గాయత్రి భాస్కర్, ఓరుగంటి నాగేశ్వరావు, అమరబోయిన గంగరాజు, జక్కుల శంభయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు




