బెల్లంపల్లి, జూన్ 2, (జనంసాక్షి )తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురుకులాలకు వరంగా అయ్యిందని ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సిఓ కొప్పుల స్వరూప రాణి అన్నారు. శుక్రవారం ఆమె బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఆమె ప్రారంభించారు. సందర్భంగా ఆమె విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత సంక్షేమ గురుకులాల వ్యాప్తి ఊహించని విధంగా పెరిగిందని, దీనివల్ల పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులకు దగ్గరయ్యారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ గురుకులాల్లో సౌకర్యాల కల్పనలో తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఉన్నత విద్యా అవకాశాలను పేదింటి బిడ్డలు గతం కంటే ఎక్కువ మొత్తంలో అందుకుంటున్నారన్నారు. సంక్షేమ గురుకులాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విధానం ఐఐటి నీట్ వంటి జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లను సాధించే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణం అన్నారు. కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ప్రిన్సిపల్ ఐనాల సైదులు ఆధ్వర్యంలో ఎగురవేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రంగాపూర్ జిల్లా పరిషత్ హెడ్మాష్టర్ రాఘమయి, గజ్వేల్ జిల్లా పరిషత్ హెడ్మాష్టర్ కె. శోభారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు తెలంగాణ పోరాటంలో అసువులు బాపిన అమరవీరులు త్యాగాలను మననం చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలని కోరారు. ఎంతోమంది మేధావులు తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ మేధస్సును అక్షరాల రూపంలో, మాటల రూపంలో వెలువరించగా తెలంగాణ ప్రాంతంలోని సకల జనులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం సిద్ధించే వరకు అవిరళ కృషి చేశారన్నారు. వారి కృషికి త్యాగానికి ప్రతీకలుగా విద్యార్థులు విజయాలు సాధించాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని, సంక్షేమ గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు. అనంతరం ఈనెల 22 వరకు జరిగే పలురకాల కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ఆర్సిఓ ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ డిఈ కొప్పుల చలపతి, వైస్ ప్రిన్సిపల్ కోట రాజకుమార్, అధ్యాపకులు నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, మహమ్మద్ రఫీ, ఆకేనేపల్లి రాజేష్, గాజుల రాజేందర్, సుంకరి రమేష్, చందా లక్ష్మీనారాయణ, అవునూరి రవి, ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాస్, కొక్కుల రాజేశ్వర్, భోగ అశోక్, అల్లూరి వామన్, పి సంతోష్, ఏ తిరుపతి, సమెంధర్, తేజస్వి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావం గురుకులాలకు మహార్దశ. – ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ఆర్సీఓ కొప్పుల స్వరూపారాణి.




