చిన్నారికి కొవ్వొత్తితో వాతలు

ఇద్దరు మహిళలపై పోలీస్‌ కేసు
ముంబై,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):  చిన్న పిల్లలు అల్లరి చేయడం సహజం.. కానీ ఓ తల్లి మాత్రం తన కూతురు అల్లరి చేస్తుందని, మాట వినడం లేదని కొవ్వొత్తితో వాతలు పెట్టింది. ఈ అమానవీయ సంఘటన ముంబై పట్టణంలోని రోడ్‌పాలీ ప్రాంతంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాలిక తండ్రి కూరగాయల వ్యాపారి. తల్లి ఇంట్లోనే ఉంటోంది. అయితే బుధవారం రాత్రి చిన్నారి ఆడుకుంటూ.. తల్లి మాటలు పట్టించుకోలేదు. దీంతో కోపం తెచ్చుకున్న తల్లి, చిన్నమ్మ కలిసి చిన్నారికి కొవ్వొత్తితో కాల్చారు. తీవ్ర గాయాలపాలైన బాలిక ఏడుస్తూ ఇంట్లోనే ఉండి పోయింది. ఇంటికొచ్చిన తండ్రి.. ఏడుస్తున్న తన కూతురుని చూసి ఏమైందని అడిగితే.. జరిగిందంతా ఆ చిన్నారి చెప్పేసింది. తక్షణమే భార్య, మరదలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళలిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.