హైదరాబాద్,ఫిబ్రవరి20( జనంసాక్షి)
: ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రి ఎదుట పది వామపక్షపార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా కేసీఆర్ వైఖరిపై నేతలు తీవ్రంగా విమర్శించారు. చెస్ట్ ఆస్పత్రిని తరలించాలన్న సిఎం కెసీఆర్ తన ఆలోచనను మానుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తు లేదు గాడిద గుడ్డు లేదని, వాస్తు పేరిట ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేసీఆర్ పనిచేస్తున్నారని, కేసీఆర్ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. వెంటనే సెక్రటేరియట్, చెస్ట్ ఆసుపత్రి తరలింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, భవిష్యత్ లో పది వామపక్షాల ఆధ్వర్యంలో మరింత ఆందోళనలను చేస్తామని సారంపల్లి హెచ్చరించారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇతర పార్టీలన్నీ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని, వాస్తు అనేది వ్యక్తుల నమ్మకం మాత్రమేనని, దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని నేతలు పేర్కొన్నారు.కేసీఆర్ ఇచ్చిన హావిూల్లో ఉచిత వైద్యం కూడా ఉందని, ప్రజా ఉద్యమాలను నిర్వహించి తరలింపును ఆపుతామని స్పష్టం చేశారు.




