Tuesday, 3 November 2026

చైన్ కొట్టేయబోయి ప్రాణాలు వదిలాడు..

హైదరాబాద్ : ఇప్పటివరకు స్నాచర్లు తెగబడ్డారు…ఇక జనంలో ఓపిక నశించింది…దొంగ కన్పిస్తేచాలు పట్టుకునేందుకు తెగిస్తున్నారు..వెంటాడుతున్నారు.. హైదరాబాద్‌లో ఓ స్నాచర్‌ గొలుసు చేతికి చిక్కగానే అంతే స్పీడ్‌లో పరుగులు తీశాడు..అయినా వదల్లేదు జనం.. అదే స్పీడ్‌లో ఆ గొలుసు దొంగను వెంటాడారు…కానీ తప్పించుకోబోయి…చివరకు ప్రాణాలే పొగొట్టుకున్నాడు ఆ స్నాచర్…నగర వాసుల్లో చైతన్యం స్నాచర్లలో భయాన్ని పుట్టించింది.

బాపూఘాట్….
హైదరాబాద్‌ బాపూఘాట్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోన్న మహిళ మెడలోని బంగారు చైన్‌ను లాగేసిన స్నాచర్ జుబేర్‌.. పారిపోయేందుకు ప్రయత్నించాడు. బాధితురాలి అరుపులతో అప్రమత్తమైన స్థానికులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్లనుంచి తప్పించుకునే క్రమంలో గాంధీనగర్, ప్రశాంత్‌నగర్‌ల మీదుగా లక్ష్మీనగర్ వరకు పరుగులు తీశాడు. ప్రజలు వెంబడించడంతో.. అతడు జానకీనగర్‌లోని గోడ దూకడంతో నాలాలో పడ్డాడు. అయినా తరమడంతో ప్రశాంత్‌నగర్‌లోని ఓ భవనంపైకి ఎక్కాడు. కిందికి దూకే క్రమంలో ప్రహరీకి ఉన్న ఇనుప చువ్వలపై పడ్డాడు. చువ్వలు అతడి తొడలోకి దిగడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పోలీసులు జుబేర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *