హైదరాబాద్‌సిటీ : వినాయకచవితి వేడుకలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో పోలీస్‌స్టేషన్ల పరిధిలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. శాంతికమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీ ప్రారంభమయ్యే నిమజ్జనానికి చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. సమైక్యతకు చిహ్నంగా ఖ్యాతి సంపాదించిన నగరంలో పండుగ వేడుకలను శాంతికి విఘాతం కలగకుండా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ సూచించారు. 33 ఏళ్ల తర్వాత బక్రీద్, వినాయకచవితి ఒకే నెలలో రావటం ఈ ఏడాది పండుగల ప్రత్యేకతగా పేర్కొన్నారు. కమిషరేట్ ప్రాంగణంలో గురువారం సైబరాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులు, హిందూ – ముస్లిం పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. డీజీపీ ఆదేశాల మేరకు అంతరాష్ట్ర, జిల్లాల నుంచి ఆవులు, లేగదూడలను రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దు ప్రాంతాల్లో 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రవాణా చేస్తున్న పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి ధ్రువీకరించేందుకు పశు వైద్యనిపుణులు డాక్టర్ వరప్రసాద్, వెంకటేశ్వర్‌రెడ్డి 24 గంటలూ అందుబాటులో ఉంటారన్నారు. పశువులకు అవసరమైన తాగునీరు, ర్యాంప్‌లు, గడ్డి జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి పశువులను తరలిస్తున్న సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వాట్సప్ నెంబరు 94906 17444కు సంబంధిత సమస్యలు, ఫిర్యాదుల ఫొటోలు, మెస్సేజ్‌లు పంపవచ్చని వివరించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం పెద్దలు భావోద్వేగమైన అంశాలను పరస్పరం గౌరవిస్తూ పండుగలను దిగ్విజయంగా నిర్వహించుకుంటామన్నారు.




