Tuesday, 3 November 2026

జనసమితిని బలోపేతం చేయడంపైనే దృష్టి

– మా పార్టీనుంచి పోటీచేసేవారుంటే సంప్రదింవచ్చు
– గ్రామాలను సస్యశ్యామలం చేయడమే పార్టీ లక్ష్యం
– వికలాంగుల సంక్షేమశాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి
– విలేకరుల సమావేశంలో జనసమితి అధ్యక్షుడు కోదండరాం
– జనసమితి జిల్లాల ఇంఛార్జ్‌ ల నియామకం
హైదరాబాద్‌, మే2( జ‌నం సాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని, అలాగే మా పార్టీ నుంచి పోటీ చేసే వారు సంప్రదించవచ్చునని తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.  సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పుడు మా ముందున్న లక్ష్యం పార్టీని బలోపేతం చేయడమేనని వ్యాఖ్యానించారు. వికాలాంగుల చట్టాన్ని సరిగ్గా అమలు చేయాలి.. అలాగే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జనసమితి పార్టీకి సంబంధించి  మహిళా విభాగాన్ని కూడా  విస్తరిస్తామని చెప్పారు. గ్రామాలను సస్యశ్యామలం చేయడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. కేరళలో గ్రామ పంచాయతీలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. జనసమితికి అప్లికేషన్‌ పెట్టుకోవచ్చునని, సభ్యత్వ నమోదు చేసుకోవచ్చునని, ఆన్‌లైన్‌లో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్‌ ఉంచుతామని తెలిపారు.
జిల్లాల ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన కోదండరాం..
నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ జన సమిత పార్టీ ఆయా జిల్లాలకు ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఖమ్మం జిల్లా ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ దిలీప్‌ కుమార్‌, వరంగల్‌కు అంబటి శ్రీనివాస్‌, కరీంనగర్‌కు గాదె ఇన్నయ్య, వికారాబాద్‌కు శ్రీశైలం రెడ్డి, నిజామాబాద్‌కు గోపాల్‌ శర్మ, నల్గొండకు విద్యాధర్‌ రెడ్డి, సిద్ధిపేటకు బైరి రమేష్‌లను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్లు తెలంగాణ జనసమిత
ప్రకటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దిలీప్‌ మాట్లాడుతూ తమ సభను ప్రజలు ఆదరించారన్నారు. సీపీఎస్‌ను తెలంగాణ జనసమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగుల ఆందోళనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని దిలీప్‌ కుమార్‌ స్పష్టం చేశారు.