ప్రతి వ్యక్తికి జన్ ధన్ ఖాతా, ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నంబర్ ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ఇవి అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఉపాధి హామీ పథకమే నిదర్శనమని మోడీ వ్యాఖ్యానించారు. ఈ పథకాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చిచెప్పారు.
తమ పథకాలను కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. పేరేదైనా ప్రజలకు మేలు కలగడమే ముఖ్యం కదా అన్నారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన భూ సేకరణ బిల్లు బాగుంటే ఆ పార్టీకే ప్రజలు పట్టం కట్టేవారు కదా అని ప్రధాని అన్నారు. రైతులకు నష్టం లేకుండా భూ సేకరణ బిల్లులో మార్పులు చేస్తున్నామన్నారు.
స్విస్ బ్యాంక్ ఖాతాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు కొనసాగుతోందని మోడీ గుర్తుచేశారు. స్విస్ బ్యాంకుల్లోని ఖాతాల వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.
అవినీతితో దేశం భ్రష్టుపట్టిపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి మహమ్మారి నుంచి దేశాన్ని బయటపడేయాలని మోడీ అన్నారు.




