Thursday, 5 November 2026

జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరణ

– సిపిఎం మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్
హుజూర్ నగర్ మార్చి 21 (జనంసాక్షి): సిపిఎం అఖిలభారత కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న జన చైతన్య యాత్ర ఈనెల 25 న హుజూర్ నగర్ కు రానున్నదని ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్ అన్నారు. మంగళవారం మండలంలోని గోపాలపురం గ్రామంలో శాఖ సమావేశ అనంతరం సిపిఎం జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ, అమిషాల నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతుందన్నారు. దేశమంటే అంబానీ, అధానీల తొత్తుగా బిజెపి ప్రభుత్వం మార్చివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల మూలంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నూనెల ధరలు మూడు రెట్లు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని మొత్తం కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం తాకట్టు పెడుతుంది అన్నారు. ఒకే భాష పేరుతో హిందీ, సంస్కృతాన్ని ప్రజలపై రుద్దుతున్నారని అన్నారు. విద్యలో జ్యోతిష్యాన్ని, సంస్కృతాన్ని పాఠంశాలుగా మార్చారని అన్నారు. రాజ్యాంగ యంత్రాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. తినే తిండి పై, వేసుకునే బట్టల పై ఆధిపత్యం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బిజెపి కలలు కంటుందని ఆ కలలను కల్లోలు చేసే సత్తా రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉందన్నారు. బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ జన చైతన్య యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జరుగుతుందని అందులో భాగంగా సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ లో ప్రవేశిస్తుందన్నారు. ఈ సందర్భంగా ఈనెల 25న హుజూర్ నగర్ పట్టణ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభ కు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ బహిరంగ సభకు వామపక్ష శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు సిద్దిల వెంకటయ్య, చందాల బిక్షం, చీకూరి తిరపయ్య, చీకూరి నాగేంద్రమ్మ, వెంకటేశ్వర్లు, సాయిలు, అనంతుల వెంకటరామయ్య, సైదులు పాల్గొన్నారు.