Thursday, 5 November 2026

అధైర్యపడకండి….అండగా ఉంటాం

– చిన్నారి హృతిక ను పరామర్శించిన జెడ్పీ చైర్మన్‌ జనంసాక్షి, ముత్తారం : చిన్నారి వైద్య సేవల గురించి అధైర్యపడవద్దని, నయం అయ్యే వరకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ హృతిక తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. హైదరాబాద్‌ లోని రావూస్‌ ఈఎన్‌టీ ఆస్పత్రిలో వినికిడి లోపంతో వైద్య చికిత్స పొందుతున్న ముత్తారం మండలం మైదబండకు చెందిన మంథని హృతికను ఆయన పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది నెలల క్రితం వినికిడి లోపంతో బాధపడుతున్న విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని ప్రముఖ ఈఎన్‌టీ రావూస్‌ ఆస్పత్రికి చిన్నారిని స్వయంగా తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అలాగే హైదరాబాద్‌లో హృతిక తల్లిదండ్రులకు వసతి కల్పించి ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కాగా మంగళవారం హృతికతో పాటు ఆమె తల్లిదండ్రులను ఆయన కలిసి వైద్య సేవలు, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా అందుతున్న వైద్య చికిత్సతో చిన్నారి హృతికలో మార్పు వచ్చిందని, చిన్నారికి వినికిడి సమస్య కొంత మేర నయం అయిందని తల్లిదండ్రులు జెడ్పీ చైర్మన్‌ కు వివరించారు. ఈ క్రమంలో చిన్నారి విషయంలో ఎలాంటి బాధపడవద్దని, పూర్తిగా నయం అయ్యే విధంగా వైద్య చికిత్స అందించేలా చూస్తామని ఆయన హృతిక తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.