Tuesday, 3 November 2026

జర్నలిస్టుల రిలే దీక్షలను విజయవంతం చేయండి

హుజరాబాద్(జనం సాక్షి):ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నివేశన స్థలాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 నుంచి హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో హుజూరాబాద్ ప్రెస్ క్లబ్ (టియుడబ్ల్యూజె–ఐజేయు) ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లి నరేందర్, పబ్బ తిరుపతి లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ హామీలు ఇవ్వడమే తప్పా వాటిని నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన జర్న లిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇప్పించాలని గతంలో ఎన్నో సార్లు నిరసనలు, ధర్నా, రాస్తారోకోలు చేపట్టామని, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల చుట్టు తిరుగుతున్న తమ సమస్యలను పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇండ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. ఇండ్ల స్థలాలను ఇచ్చే వరకు రిలే నిరాహార దీక్షలను విరమించబోమని తెలిపారు.జర్నలిస్టులందరం ఐక్యంగా ఈ రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని కోరారు.