జిల్లాలో టిడిపి, కాంగ్రెస్‌లకు భారీ కుదుపు
గులాబీ దళంలోకి నేతల వలసలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఆదిలాబాద్‌లో టిడిపికి మరో భారీ కదుపు కలిగింది. పార్టీ నాయకులు ఇప్పటికే ఒక్కరొక్కరుగా టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ బలపడుతోంది. చంద్రబాబు కరీంనగర్ పర్యటనకు ముందే జిల్‌ఆలో అరిగెల నాగేశ్వరా రావు టిఆర్‌ఎస్‌లో చేరడం టిడిపికి పెద్ద మైనస్‌గా భావించాలి. కాంగ్రెస్, టిడిపిలకుచెందిన నాయకులు మెల్లగా గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ సుల్తాన్ అహ్మద్, ఆయన కుమారుడు చెన్నూరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అహ్మద్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. చెన్నూరు, కోటపల్లి, జైపూరు మండలాలకు చెందిన అనుచర గణం, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి హైదరాబాద్‌లో సిఎం సమక్షంలో గులాబీ దళంలో చేరారు. ఇక తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, ఆ పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు కూడా తెరాస తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో టిఆర్‌ఎస్ మరింత బలం చేకూరింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కోలుకోని దెబ్బ తగిలింది. జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న అరిగెల గత కొంతకాలంగా తెరాసలో చేరుతారన్న వార్తలు వచ్చాయి. వాంకిడి ఎంపీపీ ఆర్తికతోపాటు, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లోని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, తన అనుచరులు సుమారు వంద మందితో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఇప్పుడు తెరాసలోకి అరిగెల చేరడంతో పార్టీకి కొండంత బలచేకూరినట్లేనని భావిస్తున్నారు. అయితే రాష్ట్ర స్థాయిలో రాజకీయం నెరిపిన అరిగెల స్థానిక తెరాస నాయకులు సమ్మతిని కోరకుండా, ముహూర్తం ఖరారయ్యేవరకు సమాచారం కూడా గోప్యంగా ఉంచారు. 1986నుంచి తెదేపాలో పనిచేస్తూ జిల్లాలోనే ప్రముఖ నేతగా ఎదిగారు. గతంలో ఆయన జిల్లా టిడిపి నాయకుడు వేణుగోపాలచారికి సన్నిహితంగా ఉన్నారు. అరిగెల చేరికలో ఇప్పుడు చారిప్రభావం కూడా ఉందంటున్నారు. అరిగెల తెరాసలోకి వస్తే ఆయన తనపై పెత్తనం చెలాయించే అవకాశం ఉందన్న అభద్రతాభావంతో ఎమ్మెల్యే కోవ లక్ష్మి గతంలో అరిగెల తెరాసలోకి రాకుండా అడ్డుపుల్ల వేసే యత్నం చేశారన్న ప్రచారం జరిగింది. మొత్తానికి ఇప్పుడు టిడిపిలో కొంత స్తబ్దత ఏర్పడిందనే చెప్పాలి. చంద్రబాబు కరీంనగర్ పర్యటనకు ముందే ఇలా జరగడం కూడా టిడిపికి దెబ్బగానే భావించాలి.