Thursday, 5 November 2026

జూనియర్‌ కాలేజీలకు పూర్వవైభవం

రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోంది. ఉత్తమమైన విద్యావిధానం.. ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రవేశాలకు అవకాశం కల్పించడం పేద విద్యార్ధుల పాలిట వరంలా మారింది. దీంతో.. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అధిక ఫీజులు చెల్లించలేని విద్యార్థులంతా ప్రభుత్వ జూనియర్ కళాశాలల వైపు చూస్తున్నారు. ఇంటర్ పాఠ్యపుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడంతో వారు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తున్న విద్యార్థుల సంఖ్య.. ఈ ఏడాది పెరిగింది. గతేడాదిలో పోల్చితే ఈ ఏడాది 10 శాతం ప్రవేశాలు పెరిగినట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

గతేడాది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 75 వేల మంది ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాలు పొందగా..ఈ ఏడాది ఆ సంఖ్య 82 వేలకు చేరింది. అటు ఇంటర్ సెకండియర్ లో ఈ ఏడాది మరో ఐదు వేల మంది ప్రైవేట్ కళాశాలల విద్యార్ధులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు.గతేడాదితో పోల్చితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 10 వేలకుపైగా ప్రవేశాలు పెరిగినట్లు ప్రభుత్వ జూనియర్ కాలేజిల సంఘం అధ్యక్షుడు మదుసూదన్ రెడ్డి అన్నారు

పదేండ్ల క్రితం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సీటు దొరకడం అతి కష్టంగా ఉండేది. ఉన్న సీట్లకు కొన్ని రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చిపడేవి. సీట్ల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సులు అవసరం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా రంగం వేళ్లూనుకుపోయింది. దీంతో రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు విద్యార్థులు లేక విలవిల్లాడుతున్నాయి. కార్పొరేట్ కాలేజీల కీలు బొమ్మలుగా మారిన గత పాలకులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. 63 ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు సొంత భవనాలు లేవు. నేటికీ హైస్కూళ్లు, అద్దె భవనాల్లోనే పలుకాలేజీలు కొనసాగుతున్నాయి. మరో 75 కాలేజీల్లో ఒక్క రెగ్యులర్ పోస్టు కూడా భర్తీ చేయలేదంటే గతపాలకులు ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. అయితే స్వరాష్ట్రంలో విద్యావ్యవస్ధపై కేసీఆర్ సర్కార్ సీరియస్ గా దృష్టి సారించటంతో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. జూనియర్ కాలేజీల అభివృద్ధికి రూ.143 కోట్లు రాష్ట్రప్రభుత్వం కేటాయించింది. ఆయా జూనియర్ కాలేజీల్లో కనీస మౌలిక వసతుల కోసం నిధులు వెచ్చిస్తోంది. 63 జూనియర్ కాలేజీలకు సొంత భవనాలు నిర్మించే పనులు ఊపందుకున్నాయి. 75 జూనియర్ కాలేజీల్లో 40 ప్రిన్సిపాల్ పోస్టులు, 743 జూనియర్ లెక్చరర్లు, 600 నాన్ టీచింగ్ పోస్టులతో కలిపి మొత్తం 1,599 ఖాళీలను భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపెట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యను అందిచడంతో ఈ ఏడాది ఒక్క నల్గొండ జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిల్లో వేయికి పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీల్లో దాదాపు 2 వేల మంది విద్యార్థులు వున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మూత పడటానికి సిద్దంగా వున్న150 కాలేజీలకు పూర్వవైభవం వచ్చిందని లెక్చరర్లు చెబుతున్నారు. మొత్తానికి స్వరాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలకు పునర్వైభవం వస్తుండటంపై విద్యావేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *