Wednesday, 4 November 2026

జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్.

జూనియర్ లెక్చరర్ కోర్భా లక్ష్మికి డాక్టరేట్.
నాగర్ కర్నూల్ జిల్లా, జనంసాక్షి ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కోర్భా లక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.జోగిని వ్యవస్థపై ప్రొఫెసర్ డాక్టర్ కె.రామకృష్ణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పొందారు. లక్ష్మి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. దళిత నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్నపుడు సొంతూళ్లో చూసిన జోగినిల జీవితం ఆమెను చలింపజేసింది.దీంతో తన పరిశోధన అంశంగా ఇప్పటి వరకు ఎవరూ ఎంచుకోని జోగిని ఎంచుకున్నారు.ఇలా  ది జోగిని సిస్టం ఇన్ తెలంగాణ ఏ సోషియో, ఎకనామిక్ అండ్ కల్చరల్ స్టడీ(1956-2010) పేరిట  పిహెచ్ డి   పూర్తి చేశారు. సమాజంలో దళిత, నిరుపేద మహిళలు జోగిని వ్యవస్థ ద్వారా ఎలా లైంగిక దోపిడీకి గురయ్యారు, అప్పటి నుంచి వారి జీవితంలో వచ్చిన మార్పులు, తదితర అంశాల్లో లక్ష్మి పరిశోధనలు  చేశారు.  ఇటీవల ఉస్మానియా యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్ కె.రామకృష్ణ,  ప్రొఫెసర్లు అంజయ్య, ఇందిర,‌ అర్జున్ రావు, జరీనా పర్వీన్, తదితరులు లక్ష్మికి పిహెచ్ డి పట్టాను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్నప్పుడు సొంతూరిలో చూసిన దురాచారమైన జోగిని వ్యవస్థ ద్వారా దళిత, పేద మహిళలు లైంగిక దోపిడీకి ఎలా గురవుతున్నది, ఎలా అవమానాలు పడుతున్నదీ, తదితర అంశాలను ప్రపంచం ముందుంచాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన చేశానని తెలిపారు. ప్రభుత్వ విధానాలు, చదువు, మారిన ప్రజల దృక్పథాలు జోగిని వ్యవస్థలో మార్పు తీసుకొచ్చాయన్నారు. తన పరిశోధనకు సహకరించిన ప్రాఫెసర్లు,‌ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంటర్ విద్యా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా లక్ష్మిని కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, బంధువులు అభినందించారు.
వ్యక్తి గత సమాచారం:
తల్లి : కోర్భ గంగవ్వతండ్రి : కోర్భ అబ్బయ్యభర్త    : తిప్పర్తి విజయ్స్వగ్రామం : నిజామాబాదు జిల్లా బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండలం రాయకూర్.చదువు:1 నుండి 7వతరగతి వరకు రాయకూర్ ప్రాథమికోన్నత పాఠశాల,8నుండి10వ తరగతి వరకు  పెంటకుర్దు (రవింద్ర విద్యానికేతన్ స్కూల్).ఇంటర్ : హెచ్ ఇసి (విద్యా వికాస్ జూనియర్ కళాశాల) బోధన్.డిగ్రీ :బిఏ- ప్రభుత్వ డిగ్రీ కళాశాల (బోధన్)పీజీ: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్.బిఎడ్ : పటాన్ చెరువు (మంజీర కాలేజ్)(లా) అభ్యసించారు.మొదటి పోస్టింగ్ : 2012లో  ఏపీపీఎస్సీ ద్వారా జూనియర్ లెక్చరర్‌గా,జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిక.