మహాధర్నాలు, బరోసా యాత్రలు
కొత్త రాష్ట్రంలో… కొత్త ప్రభుత్వానికి కొంత గడువు ఇవ్వాలని… ఆ తర్వాతే… సర్కారు వైఫల్యాలపై నిలదీయాలని ముందు నుంచి చెబుతూ వస్తోన్న ప్రతిపక్ష కాంగ్రెస్.. ఇటీవలే దూకుడు పెంచింది. ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పటికే పలు అంశాలపై కేసీఆర్ సర్కారుపై కాలు దువ్వుతోన్న కాంగ్రెస్.. తాజాగా రైతు ఆత్మహత్యలపై మరింత ఒత్తిడి పెంచేదిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతు సమస్యలపై జిల్లాల్లో మహాధర్నాలు, బరోసా యాత్రతో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించిన హస్తం పార్టీ.. దీనిపై ప్రభుత్వాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తోంది.
తెలంగాణలో 939 మంది రైతులు ఆత్మహత్య
తెలంగాణలో ఇప్పటి వరకూ 939 మంది రైతులు ఆత్మహాత్యలు చేసుకున్నారు. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కరువు తాండవిస్తోంది. ఇది చాలదన్నట్లు ఇటీవలి వర్షాలతో కాస్తో కూస్తో పండిన పంట సైతం మట్టిపాలైంది. ఇంత జరిగినా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్లో బరోసా కల్పించిన పరిస్థితి లేదని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కరువు మండలాలను ప్రకటించకపోవడం ద్వారా.. కేంద్ర నుంచి అందే సాయం అందటం లేదని ఆరోపిస్తోన్న కాంగ్రెస్… దీన్నే ఆయుధంగా చేసుకొని కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు పావులు కదుపుతోంది. ఇందుకోసమే పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ రాష్ట్రపర్యటనకు రంగం సిద్దం చేస్తోంది. ఆత్యహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలతో పాటు.. కష్టాల్లో ఉన్న రైతలను పరామర్శించి బరోసా కల్పించేలా రాహుల్ పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈనెల 29న దిగ్విజయ్‌సింగ్ పర్యటన
ఈనెల 29న రాష్ట్ర వ్వవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రానున్నారు. వచ్చీ రాగానే టీపీసీసీ నేతలతో సమావేశమై… రాహుల్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం వుంది. మొత్తానికి రీఎంట్రీ తర్వాత కేంద్రంపై పదునైన విమర్శలతో సెగ పుట్టిస్తోన్న యువరాజు.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వస్తోన్న టూర్‌లో కేసీఆర్ సర్కార్ పై ఎలా విరుచుకుపడుతారన్నది ఆసక్తి రేపుతోంది.




