హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్లీనరీకి ఎల్బీ స్టేడియం ముస్తాబైంది. అధికారంలోకి వచ్చాక తొలి ప్లీనరీ కావడంతో గుళాబీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. నగరాన్ని భారీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో గులాబీమయంగా మార్చేశారు. దీంతో హైదరాబాద్ పింక్ సిటీగా మారిపోయింది. గులాబీ తోరణాలతో భాగ్యనగరం గుబాలిస్తోంది. ప్రధాన వేదికను 100 అడుగులు పొడవు, 40 అడగులు వెడల్పుతో ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికపై పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్టీరింగ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీకి సంబంధించి 42 మంది ఆసీనులయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఉపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఒక్కచోటే కనిపించనున్నారు. సుమారు 36 వేల మంది ప్రతినిధులు తరలివస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున ప్రతినిధులు హాజరుకానున్నారు.




