Wednesday, 4 November 2026

టీఆర్ఎస్ ప్లీనరీ నేడే..

హైదరాబాద్ :  హైదరాబాద్‌ పింక్ సిటీగా మారిపోయింది. గులాబీ తోరణాలతో భాగ్యనగరం గుబాలిస్తోంది. అధికార పగ్గాలు చేపట్టాక… తొలిసారిగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి గులాబీదండు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఎల్బీ స్టేడియంలో వేదిక కావడంతో ఈ ప్రాంత ప్రాంగణం అంగరంగవైభవంగా ముస్తాబయ్యింది. మహానగరంలో ప్రధాన రహదారులు, కూడళ్లు గులాబీ జెండాలతో టిఆర్ఎస్ కార్యకర్తలు నింపేశారు. నగరంలో నే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ఎక్కడ చూసినా టీఆర్ఎస్‌ ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులే దర్శనమిస్తున్నాయి.
36వేల మంది హాజరు..
ప్రధాన వేదికను 100 అడుగులు పొడవు, 40 అడగులు వెడల్పుతో ఏర్పాటు చేశారు. ప్లీనరీ వేదికపై పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్టీరింగ్ కమిటీ, పార్లమెంటరీ కమిటీకి సంబంధించి 42 మంది ఆసీనులయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు కేసీఆర్ ఉపన్యాసంతో టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం కానుంది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పలువురు ప్రజాప్రతినిధులు ఒక్కచోటే కనిపించనున్నారు. సుమారు 36 వేల మంది ప్రతినిధులు తరలివస్తారని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున ప్రతినిధులు హాజరుకానున్నారు.
ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు..
ఇక కళాకారుల ఆటపాటల కోసం మరో వేదికను కేటాయించారు. వీఐపీలకు, మహిళలకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ అధినాయకత్వం ప్లీనరీ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ప్రత్యేక రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టిన అనంతరం జరుగుతున్న పార్టీ ప్లీనరీని టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం భారీ స్ధాయిలో ఏర్పాట్లు చేసింది. కాగీ ఈ ప్లీనరీలో ప్రజా సమస్యలు చర్చకు వస్తాయా..? పార్టీ అగ్రనేత భజన జరుగుతుందా వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *