‘టీచకులు’ చిన్నారులపై పైశాచికత్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 22:విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పుతున్నారు. ఆదర్శంగా ఉండాల్సి వారే విచక్షణ మరిచి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా చిన్నారులపై పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్‌, తూర్పుగోదావరి జిల్లాల్లో తాజాగా జరిగిన రెండు ఉదంతాలే అందుకు నిదర్శనం. క్రమశిక్షణ తప్పినందుకు ఓ టీచర్‌ విద్యార్థితో మూత్రం తాగించగా… క్లాసులకు సరిగా రావడం లేదని మరో ఉపాధ్యాయుడు విద్యార్థిపై ప్రతాపం చూపించాడు. ఈ ఘటనలు గౌరవప్రదమమైన ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చాయి.ఒకటో తరగతి విద్యార్థిపై ఓ మహిళా టీచర్‌ అకృత్యానికి పాల్పడింది. అభం శుభం తెలియని ఒకటో తరగతి విద్యార్థిపై పైశాచికంగా ప్రవర్తించింది. క్రమశిక్షణ పాటించడం లేదని చిన్నారితో మూత్రం తాగించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. అనపర్తిలోని సత్యభామ పాఠశాలలో గౌరి అనే మహిళా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఒకటో తరగతి విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఆ చిన్నారిని తీవ్రంగా మందలించింది. అంతేకాకుండా ఆ విద్యార్థి మూత్రాన్ని అతనితో తాగించింది. విషయం తెలిసిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. గౌరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు.

మరోవైపు, రాజధాని నగరం హైదరాబాద్‌లోనూ ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై ప్రతాపం చూపాడు. ఎల్‌కేజీ విద్యార్థిని విచక్షణ రహితంగా చావబాదాడు. సనత్‌నగర్‌ ఇందిరాగాంధీపురంలోని ఆర్బిట్‌ గ్రామర్‌ స్కూల్‌లో మహ్మద్‌ గౌస్‌ ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఈ మధ్య స్కూల్‌కు సరిగా రావడం లేదని ఆగ్రహించిన ప్రిన్సిపల్‌ ముంతాజ్‌ అహ్మద్‌ విద్యార్థిని గురువారం బెత్తంతో ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. దీంతో చిన్నారి చేతులు, వీపుపై వాతలు వచ్చాయి. దీన్ని గమనించిన విద్యార్థి తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకొని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు.