– పార్టీ నేతలపై రావెల ఫైర్
– తన నియోజకవర్గంలో పుల్లారావు అనుచరుల జోక్యంపై మండిపాటు
– వర్లరామయ్య తీరుపై ఆగ్రహం
– దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌చేసిన రావెల
గుంటూరు,మే12(జనం సాక్షి ) : తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలపైనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అంతకు ముందు రావెల కిషోర్…గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని అసైన్డ్ భూములను పరిశీలించారు. తక్కువ ధరకు భూములు ఇవ్వాలని ప్రభుత్వ ఒత్తిడి చేస్తోందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రైతులకు ఉపాధి చూపించిన తర్వాతే వారి వద్ద నుంచి భూములు సేకరించాలని రావెల కిషోర్ అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో మంత్రి పుల్లారావు అనుచరుల జోక్యం ఏంటని ప్రశ్నించారు. దళిత ప్రజా ప్రతినిధుల నియోజకవర్గంలో ఇతరుల ప్రమేయం మంచిది కాదని హితవు పలికారు. రాష్ట్రంలో అన్ని చోట్ల ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఇలాంటి చర్యలతో దళిత జాతిలో అభద్రతాభావం పెరుగుతుందన్నారు. మరో టీడీపీ నేత, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్యపై కూడా రావెల ఫైరయ్యారు. మాదిగ విద్యార్థిపై వర్ల వ్యాఖ్యలను తీవ్ర ఖండిస్తున్నామన్నారు. వర్ల దుహంకారాన్ని తగ్గించుకోవాలని హెచ్చరించారు. వర్ల పట్ల మాదిగ జాతి ఆగ్రహంతో రగిలిపోతోందన్నారు. ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని నిలదీశారు. వర్ల తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలంతా ఉద్యమానికి సిద్ధం కాకముందే వర్ల తన తప్పును దిద్దుకోవాలని సూచించారు. జిల్లా అధికారుల ఏకపక్ష తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి దళితులను అక్కున చేర్చుకుంటే నేడు దళితులపై జరుగుతున్న సంఘటనలు సరైనవి కావని రావెల హితవు పలికారు.
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..




