హైదరాబాద్, మార్చి 20 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనకంటే ఎక్కువ గొడవ జరిగినా అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలను మూడు రోజులే సస్పెండ్ చేశారని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. టీడీపీ సభ్యులు సభలోకి వచ్చేలా స్పీకర్ చొరవ చూపాలని కోరారు. టీడీపీ సభ్యులను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సరికాదని, అలా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు. సస్పెన్షన్‌పై స్పీకర్ పునరాలోచించాలని కోరారు. బడ్జెట్‌పై చర్చకు టీడీపీ సభ్యులను అనుమతించాలని, వారులేని లోటు సభలో కనిపిస్తోందని లెఫ్ట్ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, రాజయ్య అన్నారు. సభలో గందరగోళ వాతావరణలో టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పలేకపోయారని వారు అన్నారు. జానా వ్యాఖ్యలకు నాయిని స్పందిస్తూ మహారాష్ట్రలో సభ్యులను రెండేళ్లు సస్పెండ్ చేశారని దీనికేం చెబుతారని నాయిని నర్సింహారెడ్డి ఎదురు ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల వైఖరి సరిగా లేదని, సంకుచిత ఆలోచనతోనే వారు జాతీయ గీతాన్ని అవమానపరిచారన్నారు. ఏ పార్టీకైనా విమర్శించే అర్హత ఉంటుందని మంత్రి ఈటెల రాజేందర్ సభకు తెలిపారు.




