Monday, 2 November 2026

టీ కప్పులో తుఫానా చినికి చినికి గాలివానా

– అరిజన్ డైరీ ఉదంతం ఏమి కానుంది?
– నియోజకవర్గం వ్యాప్తంగా ఉత్కంఠ.
బెల్లంపల్లి, మార్చ్ 31, (జనంసాక్షి )
అరిజన్ డైరీ వర్సెస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉదంతం నియోజకవర్గం వ్యాప్తంగా ఉత్కంఠత రేపుతోంది. ఇది కేవలం టీ కప్పులో తుఫానులా కానుందా లేక చినికి చినికి గాలివానా లాగా మారనుందా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతులను మోసం చేశారానే అభియోగంపై కేసులు ఎదురుకున్న అరిజన్ డైరీ యాజమాన్యం కక్ష పూరితంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను అప్రదిష్టపాలు చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారం ఇదంతా చేస్తుందని బీఆరెస్ నాయకులు ఖండిస్తున్నప్పటికి నిప్పు లేనిదే పోగ రాదుగా అని నియోజకవర్గ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన పోస్టులు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఈ ఉదంతం టీ కప్పులో తుఫాను మాదిరిగా మరుగున పడుతుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా అరిజన్ డైరీ యాజమాన్యం ఎమ్మెల్యే కు సుమారు 40 లక్షల రూపాయల వరకు ముట్టజెప్పామని మరో ఆరోపణ చేశారు. ఈ ఉదంతం ఇలా కొనసాగుతుంటే ఎమ్మెల్యే అనుకూలూరు ఎమ్మెల్యేకు అనుకూలంగా వాదిస్తుండగా వ్యతిరేకులు అరిజన్ డైరీకి అనుకూలంగా వాదిస్తున్నారు. ఇది ఇలా ఉంటే కేవలం బీజేపీ, బిఎస్పీ నాయకులు మాత్రం ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎమ్మెల్యే వ్యవహార శైలిని ఎండగడుతున్నారు. కానీ మిగితా అన్ని రాజకీయ పక్షాలు మాత్రం ఏమి వేచి చూద్దాం, ఇప్పుడే నోరు పారెసుకోవడం ఎందుకని నిశ్శబ్దం వహిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. దీనితో ఈ వ్యవహారం ఇంతటితో ముగుస్తుందా, ఇంకా కొనసాగుతుందా అని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికి ఈ ఉదంతంపై వాట్సాప్ గ్రూపుల్లో అడపా దడపా చర్చలు జరుగుతున్నప్పటికి చివరికి ఏం జరుగుతుంది అనే ఉత్కంఠతో నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు. తాజాగా శుక్రవారం షేజల్ మరో వీడియో క్లిప్ వాట్సాప్ లో షేర్ చేసింది. ఎమ్మెల్యే మమ్మల్ని మోసం చేశాడాని మీరే న్యాయం చేయాలంటూ మంత్రి కేటీఆర్, సీఎంఓకు పంపినట్లుగా సమాచారం. ఎన్నికల ముందు ఇలా జరగడం బీఆరెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.