టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే
టేకులపల్లి,సెప్టెంబర్ 1( జనం సాక్షి ):టేకులపల్లి మండలంలోని పలు గ్రామపంచాయతీలను ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ విస్తృతంగాశుక్రవారం పర్యటించి ప్రజల వద్ద పలు సమస్యలను తెలుసుకుంటూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని పరామర్శిస్తూ ఆయా గ్రామాలలో ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకుంటున్నారు. సమస్య ఏదైనా మీకు అండగా ఉంటానని అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనుల కోసం నిధులు భారీగా కేటాయిస్తుందన్నారు. ఇంకా మిగిలిన ఎలాంటి పనులైనా ప్రభుత్వ నిధులు రాబట్టి అభివృద్ధి చేసుకుందామని, బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధిని చేపడుతున్నందున ఈ ప్రభుత్వాన్ని, బిఆర్ఎస్ పార్టీని మళ్లీ ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాలలో సీసీ రోడ్లు, బీటి రోడ్లు పలు అభివృధి పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే పర్యటనలో గ్రామాలలో ప్రజలు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు. గంగారం ఉమ్మడి గ్రామపంచాయతీలలో, గొల్లపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీలలో, బోడు,కొప్పురాయి, బద్దు తండ ఉమ్మడి గ్రామపంచాయతీలలోని గ్రామాలను జల్లెడ పట్టినట్లుగా విస్తృతంగా పర్యటించి నేరుగా ప్రజలతో మమేకమై రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల నాయకులు, సర్పంచులు ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.