హైదరాబాద్ సిటీ : ట్రాఫిక్ సిగ్నళ్ల నిర్వహణ, పనితీరును ఇక జీహెచ్‌ఎంసీ నుంచి పర్యవేక్షించనున్నారు. దీని కోసం ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ప్రస్తుతం సిగ్నల్ వ్యవస్థ పర్యవేక్షణ కొనసాగుతోంది. గ్రేటర్ పరిధిలో జామ్ లేని ప్రయాణానికి మరో 55 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సోమేష్‌కుమార్, స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేందర్, అవినాష్‌మహంతితో సమావేశమయ్యారు. మహానగరంలో భారత్ ఎలక్ర్టానిక్ లిమిటెడ్ (బీఈఎల్) ఆధ్వర్యంలో ఇప్పటికే 221 జంక్షన్లలో ట్రాఫిక్ సిగళ్లు ఉన్నాయని, మెట్రో రైల్ పనుల కారణంగా వీటిలో పది ట్రాఫిక్ సిగ్నళ్లను తాత్కాలికంగా తొలగించామని అధికారులు వివరించారు. తొలగించిన సిగ్నళ్లను ట్రాఫిక్ విభాగం సూచించిన పది ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని బీఈఎల్ ప్రతినిధులకు సూచించారు. కొత్తగా 55 సిగ్నల్స్ ఏర్పాటుకు జంక్షన్లను ఎంపిక చేసివ్వాలని హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు కమిషనర్లను సోమేష్‌కుమార్ కోరారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మెదక్ జిల్లాలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం ప్రాంతాల్లోని రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లలో సిగ్నళ్ల ఏర్పాటుకు జిల్లా ఎస్పీ నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. సిగ్నళ్ల పనితీరుపై ట్రాఫిక్, బీఈఎల్ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించనున్నట్లు సోమేష్‌కుమార్ తెలిపారు.




