Tuesday, 3 November 2026

డంపింగ్ యార్డు తరలించాలని రాస్తారోకో.

బెల్లంపల్లి, జూన్ 3, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ సమీపంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం కన్నాల బస్తీ, మధునన్న నగర్ బస్తీ వసూలు బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. గత మూడు రోజులుగా డంపింగ్ యార్డులో పొగ, దుర్వాసన వస్తుందని, దీనివల్ల వృద్ధులు, చిన్నారులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని మున్సిపల్ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోక పోవడంతో రాస్తారోకో చేపట్టి నిరసన తెలపాల్సి వచ్చిందని బస్తీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రాస్తారోకో చేపట్టడం వల్ల ఇరు వైపుల భారీగా వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న వన్ టౌన్ సీఐ శంకరయ్య సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కన్నాల బస్తీ, మధునన్న నగర్ బస్తీ వాసులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.