Tuesday, 3 November 2026

డీజీపీ కార్యాలయ పార్కింగ్‌లో మార్పులు

హైదరాబాద్‌: తెలంగాణ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడంలో భాగంగా కార్యాలయ ప్రధాన గేటు నుంచి సిబ్బంది, సందర్శకుల ద్విచక్ర వాహనాల రాకను నిషేధించారు. ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చేవారికి కేటాయించిన పార్కింగ్‌ స్థలంలో వాహనాలను నిలుపుకునేలా ఏర్పాట్లుచేశారు. డీజీపీ కార్యాలయంలో మొన్నటివరకు.. ప్రధాన గేటు నుంచి లోపలికి వెళ్లిన తర్వాత కుడి, ఎడమ వైపుల్లో వీలున్నచోట వాహనాలను పార్క్‌ చేసేవారు. అక్కడ రద్దీ ఎక్కువైతే గేటుపక్కనున్న పెట్రోల్‌బంక్‌ వైపు వెళ్లే మార్గంలో పార్కింగ్‌ చేసుకునేవారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు కొత్త వాహనాలు (ఫార్చునర్లు) వచ్చిన తర్వాత పార్కింగ్‌ సమస్యలు తలెత్తుతుండటంతో టూ వీలర్‌ల పార్కింగ్‌ విధానంలో మార్పులు చేశారు. ప్రధానగేటు లోపలికి ప్రవేశించాక ఎడమవైపు పార్కింగ్‌ పూర్తిగా నిలిపివేసి పెట్రోల్‌ బంకుకు వెళ్లే మార్గంవైపు పార్కింగ్‌కు అనుమతించారు. సోమవారం నుంచి సిబ్బంది వాహనాల్ని కూడా ప్రధాన గేటు నుంచి లోపలికి అనుమతించడం లేదు. ప్రధాన గేటుకు అవతలివైపు ఉన్న బ్యాంకు పక్క నుంచి మార్గం ఏర్పాటు చేసి అక్కడినుంచి పార్కింగ్‌ ప్రదేశానికి దారిమళ్లించారు. అక్కడ వాహనం పార్క్‌ చేసి బయటి నుంచి తిరిగి డీజీపీ కార్యాలయంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. టూ వీలర్ల పార్కింగ్‌ విధానంతోపాటు…డీజీపీ ప్రధాన కార్యాలయంలో పలుమార్పులు చేశారు. అధికారుల భద్రతా సిబ్బందికోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా బయటి నుంచి వచ్చే సిబ్బంది, సందర్శకులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *