ఢిల్లీ, విశాఖపట్నంల మధ్య నడిచే ఏపీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం విశాఖపట్నంలో ప్రారంభమయ్యింది. న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఈ రైలు(22415)ను ప్రారంభించారు.
విశాఖ నుండి ఢిల్లీకి వారంలో మూడు రోజులు బుధ, శుక్ర, ఆది వారాల్లో నడవనుంది. ఈ నెల 15 నుంచి పూర్తిస్థాయిలో రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ఈ రైలులో 16 ఏసీ బోగీలు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో ఉదయం 07.45 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో (22416) నంబరుతో ఉదయం 06.45 గంటలకు ఢిల్లీలో బయలుదేరే ఈ రైలు మరుసటిరోజు సాయంత్రం 06.45 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు




