ఆ రైలు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వరకూ ప్రయాణిస్తుంది. ఈ రైలు బుధవారం పట్టాలెక్కనున్నది. అయితే ఆ రైలుకు గార్డులు ఎవరు..? ఈస్ట్ కోస్టు రైల్వే గార్డులా లేక దక్షిణమధ్య రైల్వే గార్డులా? అనే వివాదం కొనసాగుతోంది. ఢిల్లీలోని రైల్‌భవన్‌లో .. ఏపీ రైలుకు రైల్వేమంత్రి సురేష్ ప్రభు జెండా ఊపనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా ఏపీ ఎక్స్‌ప్రె్‌సను ప్రారంభిస్తారు.
గత ఏడాది రైల్వే బడ్జెట్‌లో విజయవాడ వరకూ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. దీన్ని ఏపీ సీఎం చంద్రబాబు వినతి మేరకు విశాఖ వరకూ పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలు
దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సకాలంలో చేరినా.. తూర్పు కోస్తా రైల్వే అధికారులకు చేరడంలో జాప్యం జరిగింది. అలాగే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డురావడంతో ప్రారంభం వాయిదా పడింది. ప్రస్తుతం రైలు ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో సిబ్బంది నియామకానికి సంబంధించి కొత్తగా సరిహద్దు వివాదం మొదలైంది. ఈ రైలుకు ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు చెందిన గార్డు ఉండాలని ఆ డివిజన్ సిబ్బంది పట్టుబడుతున్నారు. అయితే, మూడు నెలలుగా ఈ రైలు బోగీలు విజయవాడలోనే ఉన్నాయి. వీటి నిర్వహణను విజయవాడ సిబ్బంది చూసుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఈ రైలును పూర్తిగా విశాఖ నుంచే న్యూఢిల్లీకి ప్రారంభించడానికి అన్ని ఏర్లాట్లూ పూర్తిచేశారు. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజన్ నుంచి డ్రైవర్లు, గార్డులు, టీటీలు విశాఖపట్నానికి చేరుకున్నారు. కానీ, విశాఖపట్నం ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలో ఉండటంతో అక్కడ సిబ్బంది.. తమ డివిజన్‌కు చెందిన వారినే గార్డుగా నియమించాలని పట్టుబడుతున్నారు. అయితే, విశాఖపట్నం నుంచి 17 కిలోమీటర్లు తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ డివిజన్ సరిహద్దు ప్రారంభమవుతుంది.
ఈ నేపథ్యంలో.. కేవలం 17 కిలోమీటర్ల పరిధి కలిగిఉండే ఈస్ట్‌కోస్ట్ రైల్వేకు ఈ రైలుపై ఎలాంటిహక్కులు లేవని విజయవాడ రైల్వే డివిజన్ ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి బండ్రెడ్డి వెంకటచలపతిరావు పేర్కొన్నారు. దువ్వాడ నుంచి విజయవాడ వరకు 333 కిలోమీటర్లు ప్రయాణించే మార్గం విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ రైలు ద్వారా వచ్చే ఆదాయం కానీ, బెర్తులు, సిబ్బంది అంతా విజయవాడ డివిజన్‌కే చెందాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వివాదం నడుమనే రైలు ప్రారంభమవుతోంది. పరిష్కారం ఎప్పటికో వేచి చూడాల్సిందే.




