ఢిల్లీ:
ఢిల్లీలో ఒక ట్రాఫిక్ పోలీస్ చెలరేగిపోయాడు. బందిపోటుని తలపించేలా రోడ్డుపై అరాచకం సృష్టించాడు. సౌత్ ఢిల్లీలో స్కూటీపై ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి వెళ్తుండగా కానిస్టేబుల్ సతీష్ చంద్ ఆమెను ఆపాడు. ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నావని, రెడ్ సిగ్నల్ క్రాస్ చేశావని, రూ. 200 ఫైన్ కట్టాలని డిమాండ్ చేశాడు. రూ. 200 చెల్లించిన ఆమె రశీదు అడిగింది. అయితే, రిసిప్ట్ ఇచ్చేందుకు హెడ్ కానిస్టేబుల్ నిరాకరించడంతో అతన్ని నిలదీసింది. కోపంతో ఊగిపోయిన సతీష్ చంద్ చేతికందిన ఇటుకలతో ఆమెపై దాడి చేశాడు. ఆమె వెంట చిన్న పిల్లలున్నారని కూడా చూడకుండా విచక్షణారహితంగా కొట్టాడు. పక్కనే ఉన్న ఆమె పిల్లలు భయంతో వణికిపోయారు.
ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వీడియోలో రికార్డ్ చేశాడు. దాంతో సతీష్ చంద్ అడ్డంగా బుక్కయ్యాడు. కానిస్టేబుల్ పై మహిళ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, వీడియో ఆధారంగా అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. విధుల నుంచి సస్పెండ్ చేశారు. దాడికి పాల్పడ్డ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ చెప్పారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడిని ఢిల్లీ సర్కారు సీరియస్ గా తీసుకుంది. ఘటనపై స్పందించిన ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర.. కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, ఢిల్లీ ఉమెన్స్ కమిషన్ చైర్ పర్సన్ బర్కా శుక్లా కూడా ఈ ఘటనపై మండిపడ్డారు. పోలీసులే ఇలా దాడులకు దిగితే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందన్నారు. సతీష్ కు కఠిన శిక్ష పడాలని, అతనిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనతో ఢిల్లీ పోలీసుల అరాచకం మరోసారి బయటపడిందని ప్రజలు మండిపడుతున్నారు. కానిస్టేబుల్ సతీష్ ను డిస్మిస్ చేయాలని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




