పంజాగుట్ట : తాను మరణిస్తూ మరో ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపింది గృహిణి. ఖమ్మం జిల్లాకు చెందిన టి.రమ (40) ఈ నెల 21న ఖమ్మంలో భర్త లక్ష్మయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. లక్ష్మయ్యకు స్వల్ప గాయాలు కాగా రమ తీవ్రంగా గాయపడింది. ఆమెను మెరుగైన వైద్యం కోసం 22న మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 23న వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. దీంతో వైద్యులు రమ భర్త లక్ష్మయ్య, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు అవయవాలు దానం చేయడానికి అగీకరించారు. పెద్ద కుమారుడు నాగ శ్రీకాంత్ ఉన్నత చదువుల నిమిత్తం 15 రోజుల క్రితం అమెరికాకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న అతను హుటాహుటిన నగరానికి వచ్చాడు. రెండు మూత్రపిండాలు, కళ్ల కార్నియాలు, కాలేయాన్ని సేకరించినట్లు నిమ్స్ జీవన్‌దాన్ కేంద్ర ప్రతినిధి అనురాధ తెలిపారు




