తెలంగాణకు కేంద్రప్రభుత్వం మళ్లీ మోసం
నిజామాబాద్, జనవరి 29 (): తెలంగాణకై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మోసం చేసిందని ఆరోపిస్తూ నగరంలోని బస్టాండ్ ఎదుట మంగళవారం ఎబివిపి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ శవయాత్ర నిర్వహించడమే కాకుండా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఎబివిపి నగర కార్యదర్శి వాసు మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తామని అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించి మోసం చేశారని, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న షిండే మరోసారి తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడం జరిగిందన్నారు. ఈ కుట్రల వెనుక సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారుల తొత్తులైన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల హస్తం ఉందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల చిత్తశుద్దితో రాజీనామాలు సమర్పించి ఉద్యమంలోకి రావాలన్నారు. ఎవరైనా రాజీనామాలు చేయని తెలంగాణ ప్రాంత నాయకులు వారి వారి ఆస్తులపైన ప్రత్యక్ష దాడులు చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో ఎబివిపి నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్యోతి, అనిల్ కుమార్, జోనల్ ఇంచార్జ్ భాను, లక్ష్మన్, రాకేష్, అక్షయ్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.