సచివాలయం రాలేని వారికి అధికారమెందుకు
నటి ఖుష్బూ సూటి ప్రశ్న
హైదరాబాద్,నవంబర్20(జనంసాక్షి): తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిందేవిూ లేదని, అప్పులిచ్చే స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చెల్లించాల్సిన స్థితిలోకి నెట్టారని కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. మంగలవారం ఉదయం హైదరాబాదులోని గాంధీ భవన్ లో విూడియాతో మాట్లాడిన ఆమె, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బిగ్ జీరో అని మండిపడిన ఆమె, గత రెండున్నరేళ్లుగా సచివాలయానికి వెళ్లని ఆయనకు పదవి ఎందుకని ప్రశ్నించారు. తన కుటుంబ ప్రయోజనాల కోసమే ఆయన తిరిగి సీఎం కావాలని కలలు కంటున్నారని ఆరోపించారు. మహిళా సాధికారతపై మాట్లాడే కేసీఆర్, తన క్యాబినెట్ లో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఖుష్బూ, ఈ ఎన్నికల్లో కేవలం నలుగురు మహిళా అభ్యర్థులను మాత్రమే టీఆర్‌ఎస్ నిలిపిందంటే, మహిళలపై ఉన్న అభిమానం ఏంటో తెలిసిపోతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తమ ఫథకాలుగా టీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. కల్యాణలక్ష్మి వంటి పథకాలను కేవలం టీఆర్‌ఎస్ పార్టీ
కార్యకర్తలు, అభిమానులకు మాత్రమే పరిమితం చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఓ నయా నవాబ్ అని ఖుష్బూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం ఒక్క రోజు కూడా సచివాలయానికి రాని కేసీఆర్.. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల మధ్యనే ఉంటాననడం హస్యాస్పదంగా ఉందన్నారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే కేసీఆర్ మహిళలకు సీట్లు మాత్రం కేటాయించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 11 సీట్లిస్తే.. టీఆర్‌ఎస్ కేవలం 4 మాత్రమే ఇచ్చిందని, ఒక్కరికి కూడా ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. 14 మంది ఎంపీల్లో ఒకే ఒక మహిళా ఎంపీ ఉన్నారని, ఆమె కూడా కేసీఆర్ కూతురేనన్నారు. మంత్రి వర్గంలో కూడా ఒక్క మహిళకు అవకాశం కల్పించలేదని, మహిళలపై నమ్మకం లేదా? అని ప్రశ్నించారు. కల్యాణ లక్ష్మీ పథకం కూడా కేవలం టీఆర్‌ఎస్ సంబంధిత వర్గాలకే అందుతుందని ఆరోపించారు. ఈ పథకానికి ఇచ్చే నిధులు రాష్ట్ర
బ్జడెట్‌లో కేటాయించలేదని, ఎక్కడి నుంచి ఖర్చు చేస్తున్నారో చెప్పాలన్నారు.




