Wednesday, 4 November 2026

నెత్తురోడిన రాష్ట్ర రహదారులు

వేర్వేరు ప్రమాదాల్లో 12మంది దుర్మరణం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏకంగా పది మంది మృత్యువాతపడ్డారు. అనేకమంది గాయపడ్డారు.కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌ ఎస్సారెస్సీ వంతెనపై జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చామన్‌పల్లి నుంచి ఇల్లంత మండలం కొత్తూరుకు పత్తి ఏరడానికి 16 మంది కూలీలు ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన పాలవ్యాన్‌ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ మాధవరావుతో పాటు ముగ్గురు మహిళలు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు. ఘోర ప్రమాదంతో రహదారి రక్తసిక్తమైంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మేడ్చల్‌ జిల్లా పేట్‌బషీరాబాద్‌ పరిధిలోని సుచిత్ర కూడలి వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు.మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం తూముకుంట వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నల్గొండ జిల్లా కట్టంగూరు వద్ద జాతీయ రహదారిపై బొలెరో వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. బాధితులను అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామస్థులుగా గుర్తించారు. వీరు హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పెద్దఆదిరాల గ్రామ పరిధిలోని ఎక్వాయపల్లిలో చోటుచేసుకుంది. తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన అక్షర ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు ఎక్వాయపల్లికి చెందిన పిల్లలను తీసుకుని వెళ్తుండగా స్టీరింగ్‌ రాడ్‌ విరిగిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి వారిని జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.