ఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 7 :
స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులను మోసం చేసి గద్దెనెక్కిన కేసీఆర్ ని గద్దెదింపాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో ఇటీవల ప్రారంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర సందర్భంగా మంగళవారం ఆయన ఇటిక్యాల మండల పరిధిలోని పుటాన్ దొడ్డి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ ప్రజల సమస్యలను విన్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధరణి ద్వారా సామాన్య రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని మండపడ్డారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కొరకు తెగించి కొట్లాడిన ఉద్యమకారులను సైతం కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని తీవ్రంగా విమర్శించారు. గ్రామ సమస్యల కోసం బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. అధికారం వచ్చిన వెంటనే భూ సమస్యలు, ధరణి సమస్యలను తొలగిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమకారులను సైతం ఆదుకుంటామన్నారు. బహుజన రాజ్యంలో ఒక్క సంతకంతో ఉద్యోగాలు, మహిళల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బహుజన సమాజ్ వాధి పార్టీని ఆదరించాలన్నారు. ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు మంద అర్జున్ కి బిఎస్పి పార్టీ కండువ కప్పి సాధారంగా ఆహ్వానించారు. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎంసీ కేశవ రావు, ఉపాధ్యక్షులు మణికుమార్, జిల్లా సలహాదారుడు బల్గర్ సురేష్ బాబు, అలంపూర్ నియోజకవర్గ అధ్యక్షులు బోరవెల్లి మహేష్, ఇటిక్యాల మండల అధ్యక్షులు పేరపోగు తిరుపాల్, పోలింగ్ బూత్ అధ్యక్షులు మార్కండేయ, సాయికుమార్, సీనియర్ నాయకులు ఎంజీ కృష్ణ, జయరాజ్ పాటు ఆయా గ్రామాల బీఎస్పీ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




